మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి! | - | Sakshi
Sakshi News home page

మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి!

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

కలెక్టరేట్‌ వద్ద పోలీసులతో శ్రీకాళహస్తి టీడీపీ నేతల వాగ్వావాదం ముగ్గురుని మాత్రమే పంపుతామన్న రూల్‌ ఎస్‌ఐ పోలీసులపై జేసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు మరికొందర్ని పంపాలని జేసీ ఆదేశాలు

తిరుపతి అర్బన్‌: ‘మా ఎమ్మెల్యే (శ్రీకాళహస్తి) బొజ్జల సుధీర్‌రెడ్డి పంపించారు. పీజీఆర్‌ఎస్‌లో సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టు పూర్తిచేయాలని అర్జీ ఇవ్వడానికి వచ్చాం. లోనికి అందర్నీ పంపండి’ అంటూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద శ్రీకాళహస్తి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కామేష్‌యాదవ్‌, మాజీ సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ తాటిపర్తి రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాయం వెంకటసుబ్బారెడ్డి, పార్టీ నేత రమేష్‌నాయుడు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అయితే ఎస్‌ఐ టీవీ సుధాకార్‌ మాత్రం అందర్నీ పంపడానికి వీలులేదని, ఎవరైనా ముగ్గుర్ని మాత్రమే పంపుతామని స్పష్టం చేశారు. అయితే తాము ఽకలెక్టరేట్‌ గేటు వద్ద ధర్నా చేస్తామంటూ ఎస్‌ఐతో వాదించారు. ఆపై జేసీకి ఫిర్యాదు చేస్తామంటూ ఆ ముగ్గురూ లోనికి వెళ్లి జేసీ గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. అయితే జేసీ మాత్రం మరి కొందరు లోనికి రావడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మరికొందరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ చాంబర్‌కు విచ్చేశారు.

వైఎస్సార్‌ హయంలోనే సోమశిల–స్వర్ణముఖికి శ్రీకారం

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 90శాతం పనులు పూర్తి చేశారు. పారెస్ట్‌కు చెందిన భూములు ఉండడంలో 10శాతం పనులు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేస్తే 250 చెరువులకు సోమశిల–స్వర్ణముఖి ద్వారా సాగునీరు అందుతుంది.

ఇప్పుడు గుర్తుకొచ్చిందా?

శ్రీకాళహస్తి మండలానికి చెందిన టీడీపీ నేతలు మాట్లాడుతూ ఈ ఏడాది కరువు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చసాగుతుందని.. ఫారెస్ట్‌ భూముల సమస్యను పరిష్కారం చేస్తే 100 శాతం పనులు పూర్తవుతాయని, దాంతో లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుందని మీడియాకు వెల్లడించారు. ఇదే నేతలు గతంలో వైఎస్సార్‌ సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement