సూళ్లూరుపేట రూరల్: రీసర్వే భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముడుపులిస్తే చాలు ప్రభుత్వ, బంజరు భూములను సైతం కట్టబెట్టేస్తున్నారు. ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు తమకు అనుకూలురైన బినామీల పేరిట భూములు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, సత్యవేడు, చిట్టమూరు, వాకాడు, పెళ్లకూరు తదితర మండలాల్లో ఎలాంటి రీ–సర్వేకు నోటీసులు ఇవ్వకుండానే రీ సర్వే పూర్తి చేసినట్టు వారివారి అస్మదీయులకు ప్రభుత్వ భూములు రాసిచ్చేస్తున్నారు.
చక్రం తిప్పుతున్న రెవెన్యూ అధికారి
పెళ్లకూరు మండలానికి చెందిన రెవెన్యూ అధికారి సూళ్లూరుపేటకు పదోన్నతి పై వచ్చారు. అధికార పలుకబడిని ఉపయోగించి డిప్యూటేషన్ పై మరళా పెళ్లకూరు మండలానికే వచ్చి ప్రత్యేకించి రీ–సర్వే జరిగే గ్రామాలకు గ్రామ రెవెన్యూ అధికారిగా నియమితులయ్యారు. అన్ని ప్రభుత్వ భూముల్లో భారీగా ముడుపులు తీసుకుని గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారి, తహసీల్దారుతో కుమ్మకై ్క కూటమి నేతల బినామీలకు భూములు కట్టబెట్టేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు భూమి ఉన్నవారు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రీసర్వే 2027 మార్చిలోపు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అవశంగా మలుచుకుని ఇక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ మండలాల్లో మరీ అధికం
నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర మండలాల్లో రెవెన్యూ సిబ్బంది, సబంధిత అధికారులు ఇంకా పెద్ద మొత్తంలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి ఎలాంటి డీకేటీ పట్టాలు పొందని వారికి, కొన్నవారికి బినామీ పేర్లతో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఫ్రీ ల్యాండ్ నుంచి రిజెక్ట్ చేసిన డివోషన్ పేరుతో అసైన్‌మెంట్ భూములు అన్నీ చక్క బెడుతున్నట్టు సమాచారం. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


