శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ భరోసా ఇచ్చారు. ఈ నెల 3న శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రమాద ఘటన మృతుల కుటుంబీకులతో ఆయన సోమవారం సాయంత్రం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, టిల్ హెల్త్ కేర్ ప్రెసిడెంట్ – మేనేజింగ్ డైరెక్టర్ కపిల్‌ఝావెర్ సమక్షంలో ఆయన బాధిత కుటుంబీకులను పరామర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల వ్యవధిలో మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల ఎక్సగ్రేషియా అందజేస్తామన్నారు. ప్రమాద బీమా పాలసీ కింద వచ్చే మొత్తం పరిహారాన్ని కూడా త్వరతిగతిన కంపెనీ అందచేస్తుందని చెప్పారు. ఇంకా ఆయా కుటుంబాలలో అర్హులైన వారికి విద్య, ఉపాధితో పాటు అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా బాధితులకు రూ.50 లక్షల ఎక్సగ్రేషియాతో కలిపి తన్నీరు వాసు కుటుంబానికి రూ.78,56,278, కె.చిన్నమస్తాన్ కుటుంబానికి రూ.72,72,234, గౌరబ్‌రాయ్ కుటుంబానికి రూ. 76,98,345, రమేష్ నటరాజ్ కుటుంబానికి రూ.61,50,178, మోహన్‌రాజ్ కుటుంబానికి రూ.65,25,235 పరిహారంగా దక్కనున్నట్టు వెల్లడించారు.
బాధాకరం
టిల్ ఘటన అత్యంత భాదాకరమన్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, బాధిత కుటుంబాలలో పిల్లలకు విద్య, అర్హులైన వారికి ఉద్యోగంతో పాటు అన్ని విధాలా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


