తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడిరోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నూతనంగా చేరిన విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, కోర్సుల నిర్మాణం, విద్యా అవకాశాలు, పరిశ్రమ అవసరాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై కళాశాల యాజమాన్యం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే.చంద్రశేఖకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాప్రయాణంలో క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఏంబీఏ విభాగాధిపతి డాక్టర్ నీరజ, ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, డైరెక్టర్ పి.శేషారెడ్డి పాల్గొన్నారు
రైలు నుంచి జారిపడి
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
రేణిగుంట: పూడి–రేణిగుంట రైల్వేస్టేషన్ల మధ్య మైలాపూర్ ఫుడ్ కంపెనీ సమీపంలో రైలు పట్టాల పక్కన సుమారు 75 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రేణిగుంట జీఆర్పీ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం .. గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెల్లని పంచె, తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, తెల్లని కండువా ఉన్నట్టు వెల్లడించారు. మెడలో ఎరుపు రంగు దారం, రుద్రాక్ష ధరించి ఉన్నట్టు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రేణిగుంట రైల్వే జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు.
‘పారామెడికల్’
జిల్లా అధ్యక్షుడిగా సుబ్రమణ్యం
నాయుడుపేట టౌన్: పారా మెడికల్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నాయుడుపేట పట్టణానికి చెందిన ఎన్.సుబ్రమణ్యం ఎంపికయ్యారు. అసోసియేషనన్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ రాష్త్ర కార్యదర్శి వీ.రమేష్‌బాబు సారథ్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిలుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సుబ్రమణ్యం సూళ్లూరుపేట సీహెచ్‌సీలో పీఎం అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.52 కోట్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ1,52,72,166 వచ్చినట్లు ఈవో బీకే వెంకటేశులు తెలిపారు. ఆలయ ఆవరణలోని కొట్టు మండపంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. బంగారం 37 గ్రాములు, వెండి 421.700 కిలోలు, విదేశీ కరెన్సీ 54 నోట్లు వచ్చినట్టు వెల్లడించారు. 26 రోజుల వ్యవధిలో ఈ హుండీ ఆదాయం వచ్చిందన్నారు. పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి, కుసుమకుమారి, కౌసల్యమ్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


