భాకరాపేట: యర్రవారిపాళెం మండలంలోని యల్లమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్డివారిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు రగ్బీ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 9వ తరగతి విద్యార్థి బి.శ్రీమణికంఠ అండర్–17 విభాగంలో, మరో 9వ తరగతి విద్యార్థి బి.మనోజ్ అండర్–14 విభాగంలో రగ్బీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ మీట్‌కు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు కాకినాడలో నిర్వహించనున్నారు.
విద్యార్థినికి అభినందనలు
తడ: ఆంద్రప్రశ్ రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లా, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన 41వ పెంటాథ్లాన్ సీనియర్ ఇంటర్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2026 పోటీలలో తడ కేజీబీవీ కళాశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కే రిషిత చూపిన ప్రతిభకు కళాశాల యాజమాన్యం ఆమెను అభినందించింది. సోమవారం కళాశాలలో కేజీబీవీ ప్రిన్సిపల్ రాజమ్మతోపాటు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిని అభినందించారు. రాష్ట్ర స్థాయి పెంటాథ్లాన్‌లో అండర్ 16 విభాగంలో పాల్గొని 60 మీటర్ల విభాగంలో తృటిలో పతకం చేజారిందన్నారు.
మహిళకు తీవ్ర గాయాలు
నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో బైపాసు రోడ్డుపై సోమవారం రాత్రి టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం.. నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న టిప్పర్ లారీ ఆర్టీసీ బస్టాండు సమీపంలో రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని మహిళను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


