తిరుపతి సిటీ: ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్సీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అకడమిక్ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమయ నిర్వహణ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉపాధికి అవసరమైన ఇతర సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. సుమారు 250మంది విద్యార్థులు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీ.పద్మావతి, ప్రొఫెసర్లు బీ.దేవప్రసాద్‌రాజు, వై.సునీత, కిషోర్, పరమగీతం పాల్గొన్నారు
ఉచిత శస్త్ర చిక్సితకు ఎంపిక
తిరుపతి తుడా: స్విమ్స్ ఆధ్వర్యంలో టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు సుమారు 623 మంది పేద రోగులు పలు శస్త్రచిత్సలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అధ్యక్షత ఎంపిక కమిటీ సమావేశమైంది. డైరెక్టర్ మాట్లాడుతూ రోగుల ఆరోగ్య స్థితిగతులు, అర్హతలను బట్టి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడానికి 19 విభాగాలకు సంబంధించి 623 మందిని ఎంపిక చేశామన్నారు. సుమారు రూ.2.2 కోట్ల విలువగల శస్త్రచికిత్సలు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, బర్డ్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ రామ్మూర్తి, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలపై నిఘా
తిరుపతి క్రైం: జిల్లాలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఈగల్ టీమ్ ఇన్‌న్‌స్పెక్టర్ డి.నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కూడళ్లలో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. మత్తుపదార్థాల సరఫరా గొలుసును గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా తనిఖీలు సాగుతున్నట్టు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.


