చంద్రగిరి: వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం రబీ విత్తన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాబోయే రబీ కాలానికి గాను ఎల్–నినో పరిస్థితుల దృష్ట్యా అనువైన పంటల ఎంపికతో పాటు రైతులకు విత్తన ప్రాముఖ్యత, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తత సాంకేతిక పంట సాగు విధానాలపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమానిన నిర్వహించారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి విత్తన నాణ్యతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మొక్కల ప్రజనన విభాగం డైరెక్టర్ డాక్టర్ రెడ్డిశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన స్థానాల వద్ద, ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంస్థల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి మునీశ్వర ప్రసాదరావు తదితరులు ప్రసంగించారు. తర్వాత ఆర్‌ఏఆర్‌ఎస్ వేరుశనగ ప్రజనన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన ‘వేరుశనగ – నూతన వంగడాలు‘ అనే కరపత్రం అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి కవిత, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జాన్, శాస్త్రవేత్తలు భారతి, హరిత, ప్రతిమ, రాస్‌కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాసులు, దేవకీ, రూపేష్ కుమార్‌రెడ్డి, జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త రామకృష్ణరావు, మునీశ్వర ప్రసాదరావు పాల్గొన్నారు.


