తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో గత నెల 30వ తేదీతో రెండు విడతల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 45శాతం సీట్లు మాత్రమే భర్తీకాగా, టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న కళాశాలల్లో కాస్త మెరుగైన ప్రవేశాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఓఏమ్‌డీసీ ద్వారా చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతోనే ప్రవేశాలలో భారీ తేడా ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘స్పాట్’ నిర్వహిస్తారా?
యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పలు డిగ్రీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఓఏమ్‌డీసీ మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియకు అవకాశం ఇస్తుందా..? లేక స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇస్తుందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ప్రతి రోజూ కళాశాలల చుట్టూ సీటు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు సైతం స్పాట్ అడ్మిషన్లు ఈ వారంలోనే నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


