● రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎల్‌నినో ప్రభావిత జిల్లాల గుర్తింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, కరువుతో సతమతమవుతున్న రాష్ట్ర పరిస్థితులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంలో కూటమి పెద్దలు విఫలయమయ్యారని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌చౌహాన్ పర్యటించారన్నారు. అయితే ఎల్‌నినో, కరువు పరిస్థిని అంచనా వేసి గరిష్ట స్థాయిలో రాష్ట్రానికి సాయం పొందడానికి ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అన్న విషయాన్ని కూడా మరిచిపోయి రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. కేవలం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తీవ్ర కరువు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటిస్తూ కేంద్రం ప్రకటించిన జిల్లాల్లో అన్యాయం జరిగినా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దీనిపై కూటమి పెద్దలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 388 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇది రాష్ట్రంలో 55.5శాతం మాత్రమే అన్నారు. అదే రాయలసీమలో 250 మండలాలకు గాను 186 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఇది రాయలసీమలో 75 శాతం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు దీనిని గుర్తిస్తూ ఆచరణలో ఉపశమనం కోసం డ్రాట్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మొత్తం మండలాలను కరువు మండలాలుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.


