తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలిక తప్పిపోవడంతో అప్రమత్తమైన తిరుమల పోలీసులు రెండు గంటల్లోనే బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, కిష్టారం గ్రామానికి చెందిన నరసింహులు, లడ్డమ్మ దంపతుల కుమార్తె అను షామిని (9)తో కలిసి తిరుమలకు వచ్చారు. వెంకటా ద్రి నిలయంలో బస చేస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున బాలిక కనిపించకుండా పోయింది. తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టి రెండు గంటల్లోనే బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎవరైనా తప్పిపోయినట్లయితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


