రేణిగుంట: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప జిల్లాకు బయలుదేరిన సీఎం చంద్రబాబునాయుడుకు సాదర వీడ్కోలు లభించింది. ఇందులో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, భానుప్రకాష్, కోనేటి ఆదిమూలం, మురళీమోహన్, ఆర్‌డీఓ భానుప్రకాశ్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
చంద్రగిరి: జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలకు విచ్చేసిన ఇంటర్మీడియట్ విద్యామండలి కమిషనర్ రంజిత్ బాషాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల నుంచి వచ్చిన నాన్‌టీచింగ్ సిబ్బందికి సర్వీస్ రూల్స్ విషయంపైన, సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల పదోన్నతులపైన కమిషనర్‌కు విన్నవించామన్నారు. అసోసియేషన్ సెక్రటరీ మాధవ నివాస్, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్‌గాంధీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునిశంకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరావు, షణ్ముఖరెడ్డి, గిరిగోపాల్ పాల్గొన్నారు.
పెంచలకోనలో వృద్ధుడి మృతి
రాపూరు: పెంచలకోనలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమీపంలో శుక్రవారం ఉదయం వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. రాపూరు మండలం, పెనుబర్తి గ్రామానికి చెందిన సాబ్‌జాన్ (60) పెంచలకోనలో ఉంటూ పాత పేమర్లు, బాటిళ్లు వేరుకుంటూ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద నిద్రించేవాడు. గురువారం కూడా అక్కడే పడుకుని నిద్రించాడు. ఉదయాన్నే చూడగా మృతిచెంది ఉండడాన్ని గుర్తించి స్థానికులు వెంటనే కుటుంబ సభ్యు లకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లారు. క్షేత్రంలోని మూడు ఆలయాలను మూసివేసి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
తడ: చెట్టుకు ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తడలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. తడకండ్రిగ పంచాయతీ పరిధి, కరిపేటి కాలువ వద్ద చెట్టుకు గుర్తు తెలియని మహిళ మృతదేహం వేలాడుతున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ చనిపోయి మూడు, నాలుగు రోజులు కావడంతో ఆ మేరకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల కోసం వివరాలు సేకరించారు. వరదయ్యపాళెం స్టేషన్‌లో గత నెల 30వ తేదీన తిరుపతి జిల్లా, వరదయ్యపాళెం మండలం, చావలి లింగమనాయుడుపల్లి గ్రామానికి చెందిన మాంబట్టు లోకయ్య భార్య విజయ(44) కనిపించడం లేదనే ఫిర్యాదు ఉన్నట్టు తెలుసుకుని, వారికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను విజయగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీకి రూ.50.2 లక్షల విరాళం
తిరుమల: తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50.2 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
చిత్తూరుకు చెందిన సురేష్‌కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన చుండి రంగ నాయకులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


