సబ్జెక్టుల వారీగా పోటాపోటీ
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అప్‌గ్రేడ్ చేసిన హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులకు బోధించేందుకు ఈ 118 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 270 మంది దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య భారీగా ఉండడం, ఖాళీలు పరిమితంగా ఉండడంతో ప్రతి పోస్టుకూ తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రధాన సబ్జెక్టుల స్థానాల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాను పట్టుకుని అధికారుల వద్దకు క్యూ కట్టారు. ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేస్తూ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కౌన్సెలింగ్ గందరగోళం నడుమ సాగింది. శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి టీచర్లు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. అయితే సీనియారిటీ జాబితాల్లో గందరగోళం, అభ్యంతరాలు, పలు కారణాల వల్ల కౌన్సెలింగ్‌ను సాయంత్రం వరకు నిర్వహించలేని పరిస్థితి. పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ అన్న చందంగా మారిన ఈ ప్రక్రియలో సీనియార్టీ స్థానాల కోసం ఉపాధ్యాయులు పోటాపోటీగా నిలిచారు. ఈ కౌన్సెలింగ్ కేటాయింపుల్లో తీవ్ర ఆలస్యం జరగడంతో, ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హైస్కూల్ ప్లస్ విద్యాలయాల్లో మొత్తం 118 పీజీటీ పోస్టుల డిప్లాయ్‌మెంట్ కోసం ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గంటల తరబడి నిరీక్షణ.. సాయంత్రానికి మోక్షం!
ఉమ్మడి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉపా ధ్యాయులు కూర్చోవడానికి సరైన వసతులు లేక, ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది.
పారదర్శకంగా నిర్వహించాం: ఇన్‌చార్జి డీఈవో
కౌన్సెలింగ్ ఆలస్యమవడంపై ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు వివరణ ఇస్తూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, సీనియార్టీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా స్థానాలను కేటాయించాలనే ఉద్దేశంతోనే జాబితాల పరిశీలనకు కొంత సమయం పట్టిందని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో, మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఈ త్వరితగతిన భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు.


