చంద్రగిరి: వ్యవసాయ పరిశోధనలకు రైతే కేంద్రబిందువుగా ఉండాలని, రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే దిశగా శాస్త్రవేత్తలు పనిచేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సూచించారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా నేరుగా రైతు పొలం వరకు చేరాలని సూచించారు. పునరుత్పాదక వ్యవసాయం, పర్యావరణహిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి రంగాల్లో విస్తృత పరిశోధనలు చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రైతులకు వేగంగా చేరేలా సమర్థమైన ఎకోసిస్టమ్‌ను అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగ అవసరాలకు అనుగుణంగా పరిశోధన, విద్య, విస్తరణ కార్యక్రమాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. అనంతరం బి. రాజశేఖర్, విశ్వవిద్యాలయ ఉపకులపతులతో కలిసి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థావరంలోని వివిధ పరిశోధన విభాగాలను పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జె.వి.రమణ, పరిశోధన సంచాలకులు డాక్టర్ వి.సుమతి, విస్తరణ సంచాలకులు జి.రామచంద్రరావు, వ్యవసాయ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ఎం.వి.రమణ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ టి.దామోదర్‌నాయుడు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్ బి. చంద్రిక, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.హేమలత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.ప్రసాదరావు పాల్గొన్నారు.


