తడ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసే జార్ఖండ్ రాష్ట్రం, రాంచికి చెందిన అంకిత కుమారి(28) మృతి చెందగా, ఉత్తరప్రదేశ్‌కి చెందిన షరద్ యాదవ్ గాయాలతో బయట పడ్డాడు. ఎస్‌ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అంకిత, షరద్ యాదవ్ శ్రీసిటీలోని హవెల్స్ పరిశ్రమలో పనిచేస్తూ తడలో విడివిడిగా నివసిస్తున్నారు. పరిశ్రమ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న అంకితకుమారి శుక్రవారం ఉదయం తన బైక్‌పై విధులకు వెళుతూ అదే పరిశ్రమలో పనిచేస్తూ, సమీపంలోనే నివసించే శరద్ యాదవ్‌ను వెనుక ఎక్కించుకుని బయలు దేరారు. శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద ముందు వెళుతున్న బైక్‌ను గుజరాత్‌కి చెందిన లారీ చైన్నె వైపు వెళుతూ అతి వేగంగా వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోగా అంకిత ఛాతీ మీదుగా లారీ ముందు చక్రం ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెనుక కూర్చున్న షరద్‌యాదవ్ గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై షరద్‌యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


