రేపటి నుంచి ఇంటర్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో బుధవారం నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఇప్పటికే మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సమాచారం అందించామన్నారు. ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలల్లో తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 1,324 సీట్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ రెండు కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు తీవ్ర పోటీ నెలకొలనడంతో బైపీసీకి జనరల్‌ కేటగిరీలో 95 శాతం మార్కుల వరకు, ఎంపీసీలో 94 శాతం మార్కుల వరకు సీట్ల కేటాయింపు ఆగినట్లు సమాచారం.

‘బర్డ్‌’కు రూ.10 లక్షల విరాళం

తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న బర్డ్‌ ట్రస్ట్‌ ఆస్పత్రిలో గతంలో స్వాంతన పొందిన దివ్యాంగుడు పులి సందీప్‌ తమ కుమార్తె పేరిట ఆస్పత్రికి రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. సెరిబ్రల్‌ పాలసీతో బాధపడుతున్న సందీప్‌కు 1995లో బర్డ్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ గుడారు జగదీష్‌ శస్త్ర చికిత్స చేసి, వైద్యం అందించారు. కోలుకున్న ఆయన ఉన్నత విద్యను అభ్యసించి సాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం సాధించారు. బెంగళూరులో ఎన్‌వీఐడీఐఏ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమార్తె పేరిట తన కుటుంబ సభ్యులతో కలసి రూ.10,01,016 విరాళాన్ని బర్డ్‌ ట్రస్టుకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సోమవారం డైరెక్టర్‌ సూచనల మేరకు బర్డ్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకారెడ్డికి చెక్కును అందజేశారు. నిరుపేదలకు, అర్థులకు వైద్యం అందించేందుకు వినియోగించాలని దాత కోరారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 95,094 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

పీసీపీఎన్డీటీ చట్టం పటిష్టతకు టోల్‌ఫ్రీ నంబర్‌

తిరుపతి తుడా: ఆడశిశువుల సంరక్షణకు, భ్రూణహత్యల నివారణకు అమల్లో ఉన్న పీసీపీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నంబర్‌ 18002332447ను ఏర్పాటు చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకాధికారి డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌ తెలిపారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించేవారి గురించి సమాచారం ఇచ్చేందుకు ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చని, సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు. గర్భంలో పెరిగే శిశువు ఆడా, మగా అని చెప్పడం, లింగనిర్ధారణ సేవలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం చట్ట విరుద్ధమని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రతిభ చాటుకున్న

గ్రామీణ క్రికెటర్‌ తేజ

సూళ్లూరుపేట: మండలంలోని ఆబాక గ్రామానికి చెందిన డీ తేజ(19) అండర్‌–19 క్రికెట్‌ క్రీడ లో తన ప్రతిభను చాటుకుని అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌పీఏ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లో విజేతగా నిలిచి తన సత్తా చాటుకున్న తేజ ఇప్పుడు థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయస్థాయి క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. తేజకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement