తిరుపతి రూరల్: రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని వెరిటాస్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్‌ఈ – 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో కె. హితేష్ రెడ్డి 485 మార్కులతో పాఠశాలకు టాపర్‌గా నిలవగా, బీఎం సాయి చందన్ 479, టి. తమిళ్ 478, కుర్షిద్ ఆలం 477, వి. మాధవ్ 474 మార్కులు సాధించి ప్రథమ స్థానాల్లో నిలిచారు. మొత్తం 138 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఫలితాల సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో పాఠశాల చైర్మన్ బి.శేషారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీకర్‌రెడ్డి విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ సీజీహెచ్ ఖాన్, ప్రిన్సిపల్ పీఆర్‌ఎస్ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ ఎస్.నాగార్జున, అకడమిక్ కోఆర్డినేటర్ రాధిక పాల్గొన్నారు.
ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. 2018 డిసెంబర్ 28వ తేదీ ప్రొద్దుటూరు రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది కాజీపేట సెక్షన్, లంకమల రిజర్వ్ ఫారెస్ట్, జండాలవరం బీట్, దబ్బలమెట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, జెండాలవరం వీఆర్వో కాలనీకి చెందిన ఎస్. జానయ్య, వైఎస్సార్ కడప జిల్లా, కాజీపేట మండలం, నాగసానిపల్లికి చెందిన కె. మల్లికార్జున ఇద్దరు ద్విచక్ర వాహనంలో 84 కిలోల ఏడు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డారు. ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


