లబో‘ట్యాబో’! | - | Sakshi
Sakshi News home page

లబో‘ట్యాబో’!

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

● పది మూల్యాంకనంలో మొరాయించిన ట్యాబ్‌లు ● రాత్రి వరకు ఉపాధ్యాయుల పడిగాపులు ● కొంపముంచిన కొత్త విధానం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గందరగోళంగా మారింది. విద్యాశాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానం ఉపాధ్యాయుల పాలిట శాపంగా పరిణమించింది. డిజిటల్‌ మూల్యాంకనంలో భాగంగా మార్కులను ట్యాబ్‌లలో నమోదు చే యాలన్న నిబంధన అమలులో విఫలం కావడంతో, ఉపాఽ ద్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి 10 గంటల వరకు కేంద్రాల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొరాయించిన ట్యాబ్‌లు

ప్రభుత్వం సరఫరా చేసిన పాత ట్యాబ్‌లు మూల్యాంకన కేంద్రాల్లో అడుగడుగునా ఆటంకం కలిగించాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పని సులభతరం అవుతుందని భావించినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. సాఫ్ట్‌వేర్‌ లోపాలు, నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్‌ కనెక్షన్‌, తరచూ హ్యాంగ్‌ అవుతున్న పరికరాలతో ఉపాధ్యాయులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. గంటల తరబడి ప్రయత్నించినా మార్కుల నమోదు కాకపోవడంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ‘కొత్త విధానం పేరుతో తమపై పనిభారం పెంచడమే తప్ప, సౌకర్యమేమీ లేదు’ అని పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నరకయాతన

ఈ జాప్యం వల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘మార్కులు నమోదు చేశాకే ఇంటికి వెళ్లాలి’ అన్న అధికారుల మొండి వైఖరితో మహిళా ఉపాధ్యాయులు పడరానిపాట్లు పడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది. దూరాభారం నుంచి వచ్చిన వారు, చిన్న పిల్ల తల్లులు నరకయాతన అనుభవించారు. రవాణా సౌకర్యాలు లేని సమయంలో చీకటి పడ్డాక ఇళ్లకు వెళ్లడం భద్రతపరంగా ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ట్యాబ్‌ల సమస్యను పరిష్కరించాలని, మహిళా ఉపాధ్యాయుల పనివేళల విషయంలో వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ప్రక్రియ, సోమవారం రాత్రి 10 గంటలైనా పూర్తి కాలేదు. ‘చిన్న పిల్లలను ఇంట్లో వదిలి వచ్చాం. ఇక్కడ ట్యాబ్‌లు పని చేయవు.. ఇంటికి వెళ్దామంటే అనుమతి ఇవ్వరు. ఈ కొత్త విధానం మాకు శాపంగా మారింది’.. అని ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

కొంపముంచిన కొత్త విధానం

గతంలో మాన్యువల్‌ పద్ధతిలో వేగంగా సాగే మూల్యాంకనం, ఇప్పుడు డిజిటల్‌ మాయలో పడింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కొత్త విధానం కొంప ముంచిందని, సరైన శిక్షణ, సాంకేతిక సన్నద్ధత లేకుండా దీనిని అమలు చేయడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత

ఒక వైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు తీవ్రమైన సిబ్బంది కొరత మూ ల్యాంకన ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చింది. ట్యాబ్‌లు మొరాయించడంతో సమయం వృథా అవుతుంటే, ఉన్న తక్కువ మంది సిబ్బందిపైనే పనిభారం పడుతోంది. దీంతో టీచర్లు అసహనానికి గురవుతున్నారు. విధులకు నియమించిన సిబ్బంది హాజరుకాకపోవడం మూ ల్యాంకన ప్రక్రియలో అధికారులకు పెనుసవాలుగా మారింది. డ్యూటీలు వేసినప్పటికీ చాలా మంది టీచర్లు వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు చూపుతూ గైర్హాజరు కావడంతో జవాబుపత్రాల మూల్యాంకనం మందకొడిగా సాగుతోంది.

రంగంలోకి అబ్జర్వర్‌

పరిస్థితి తీవ్రతను గమనించిన స్టేట్‌ అబ్జర్వర్‌ మువ్వా రామలింగం మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఆయన ట్యాబ్‌ల పనితీరును, నెట్‌వర్క్‌ సమస్యలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక బృందంతో చర్చించి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement