శ్రీకాళహస్తి: పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం నుంచి జాతర ప్రారంభమైంది. మూడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజు మంగళవారం గెరిగ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదట ముత్యాలమ్మ ఆలయంలో ఉన్న వినాయకస్వామి ఆలయం వద్ద విశేష పూజలు చేశారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారికి పలు రకాల అభిషేకాలు చేసి, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. జాతరలో మొదటి రోజు ఉదయం మైలు ముగ్గు, రాత్రి శేషపాన్పు ముగ్గు వేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పుల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ముత్యాలమ్మకు సమర్పించారు. తరువాత అర్చకులు పోతురాజు, గెరిగలకు పూజలు చేసి, ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళస్తీశ్వరాలయ పాలకమండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.


