చెరువు గుంతలో పడి చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువు గుంతలో పడి చిన్నారి మృతి

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

ఏర్పేడు: మండలంలోని చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో ఉన్న చెరువులో తోటి స్నేహితులతో ఆడుకుంటూ కాలుజారి నీటి గుంతలో పడి చిన్నారి వై.సుస్మిత(6) దుర్మరణం చెందింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సౌత్‌ అమలూరు, ఏకే నగర్‌కు చెందిన శంకరయ్య, విజయ దంపతులు జీవనోపాధి నిమిత్తం చిందేపల్లి ఎస్టీ కాలనీకి వచ్చి కొన్నేళ్ల కిందట ఇక్కడే స్థిరపడ్డారు. వీరికి నారాయణ, సుస్మిత అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరి కుమారుడు నారాయణ(7) చిందేపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి, కుమార్తె సుస్మిత ఒకటో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి శంకరయ్య చిందేపల్లి సమీపంలోని ఓ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ చిందేపల్లి ఎస్టీ కాలనీలోనే రెండేళ్ల క్రితమే స్థిరపడ్డాడు. శంకరయ్య బావమరిది మునిరాజ సోమవారం మామండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, శంకరయ్య, విజయ దంపతులు మంగళవారం ఉదయం అతని అంత్యక్రియలకు శెట్టిగుంటకు వెళ్లారు. మంగళవారం ఉదయం సుస్మిత స్కూలుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి తోటి స్నేహితులతో కలసి కాలనీ శివారులో ఉన్న చెరువులోకి ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో జేసీబీతో తవ్విన నీటి గుంతలో కాలుజారి పడిపోయి మునిగిపోయింది. దీంతో తోటి చిన్నారులు భయాందోళనతో కాలనీలోకి పరుగు పరుగున చేరుకుని జరిగిన విషయాన్ని కాలనీవాసులకు తెలిపారు. దీంతో కాలనీవాసులు చెరువులోకి చేరుకుని నీటిగుంతలో ముగినిపోయి మృతి చెందిన సుస్మిత మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహం వద్ద భోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement