తిరుపతి సిటీ: తిరుపతి కేంద్రంగా ఎస్వీ జూనియర్ కళాశాలలో గత 18 రోజులుగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది. వారం రోజుల పాటు కంప్యూటరీకరణ, మార్కుల జాబితా తయారీ వంటి ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం ఈనెల 15 లేదా 17వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తిరుమలలో అదనపు ఈఓ తనిఖీలు
తిరుమల: తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం తనిఖీలు చేశారు. రామ్ భగీచా బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలా న్ని పరిశీలించారు. అనంతరం ఆకాశగంగ వద్దకు చేరుకున్న అదనపు ఈవో దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న లేబర్ షెడ్లను కూడా తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని ఏటీసీ వద్దకు చేరుకున్న ఆయన రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర, ఈఈలు శ్రీనివాసరావు, వేణు గోపాల్, డీఈ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.


