జేఈఈ ఫలితాలు 16కు వాయిదా
తిరుపతి సిటీ: ఎన్‌టీఏ ఆధ్వర్యంలో గత నెల 21 నుంచి 29వ తేదీవరకు జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్–1 ఫలితాలు ఈనెల 16వ తేదీ వెలువడనున్నట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ సెషన్–1 ఫలితాలను గురువారం విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేసింది.
ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించండి
తిరుపతి అర్బన్: ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో క్రమశిక్షణ కమిటీ నిర్వహణ నేపథ్యంలో వైద్యబృందంతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు. అలాగే పీఎంజేవై ద్వారా అర్హత ఉన్నవారితోపాటు హెల్త్‌కార్డులు లేని వారికి ఉచితంగా వైద్యం అందించాలని తెలిపారు. మరోవైపు రోగులకు నాణ్యమైన భోజన వసతి కల్పించడంతోపాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ శాల ట్రస్టుకు గురువారం రూ.10,00,116 విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కుప్పాల నిలేష్ కుమార్ ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుపతిలోని ఆయన నివాసంలో అందజేశారు. గోసంరక్షణ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
జేఈఈ ఫలితాలు 16కు వాయిదా


