భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: నగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం కలిగించింది. ఈ ఘటనపై భర్త వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, అలిపిరి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు తిరుపతి ఆటోనగర్, అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న సి. మౌలిక (26) ఈ నెల 10వ తేదీ ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే రుయాస్పత్రికి తరలించారు. ఉదయం 9.13 గంటలకు ఆమెను పరీక్షించగా వైద్యులు ‘బ్రైన్ డెడ్’గా ప్రకటించారు. మమృతురాలి తల్లి సి.లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2020లో సి. మౌలికను పి.ఉదయ్‌కి వివాహం జరిపించారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు ఆటోనగర్‌లో నివసిస్తున్నారు. అయితే వివాహానంతరం భర్త ఉపాధి లేకుండా తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి మౌలికను శారీరక, మానసిక వేధింపులకు పాల్పడేవాడని మృతురాలి పుట్టింటివారు ఆరోపించారు. సౌమ్య అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ‘మౌలిక చనిపోతే ఆమెను వివాహం చేసుకుంటాన’ని బెదిరించే వాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మౌలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


