ఎవరినైనా కొడితో నాకు కిక్కొస్తుంది!
చంద్రగిరి: ‘మత్తులో ఉన్నప్పుడు నాకు ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవరు కనిపించినా వారిని కొడతా..అలా కొడితే నాకు మంచి కిక్కు వస్తుంది. మత్తులో దాడులు, దౌర్జన్యాలు చేస్తాను’ ఇది పోలీసులకు పట్టుపడిన రౌడీ షీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ పోలీసులకు చెప్పిన మాటలు. అతను మాటలు విన్న పోలీసులు సైతం ఇదెక్కడి పిచ్చిరా..బాబూ? అని నోరెళ్లబెట్టడం వారి వంతైంది. గత నెల 21వ తేదిన మండలంలోని ఎగువరెడ్డివారిపల్లిలో మౌనిక అనే వివాహిత ఇంటిపై సన్నీతో పాటు మరికొంత మంది అర్ధరాత్రి దాడులకు తెగబడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చంద్రగిరిలో రౌడీషీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్టు చేశారు.


