చంద్రబాబు నిర్లక్ష్యం రైతులకు శాపం
రైల్వేకోడూరు అర్బన్: నాడు, నేడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర రైతులపై అశ్రద్ధ చూపి, రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ఎత్తు పెంచుతూ ఇక్కడి ఆయకట్టు రైతులకు నీరు రాయనీకుండా ఆపుతోందని తెలిపారు. ప్రస్తుతం 129 టీఎంసీల నిల్వ సామర్థం ఉండగా రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, కర్ణాటక ప్రతిపాదనల మేరకు 279 టీఎంసీల నీరు నిల్వ సామర్థానికి పెంచితే రాష్ట్రంలో లక్ష ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదన్నారు. అల్మట్టి ఎత్తుపెంచుతున్నా చూస్తూ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. దీనికితోడు రాష్ట్ర ప్రజల జీవ నాడి పోలవరం పూర్తి చేయలేదన్నారు. మాజీ సతెం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా రైతల కోసం ముందుండి పోరాటాలు చేశారని తెలిపారు. 2009లో కర్ణాటక అల్మట్టి ఎత్తుపెంచుతుంటే పోరాడి, పనులు ఆగిపోయేలా చేశారని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రాజెక్టులకు కర్నూలులో మహాధర్నా చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టాక రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు కట్టి పూర్తి చేశారని పేర్కొన్నారు. అప్పుడు తమ ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప, రైతులకు చేసిందేమీలేదన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి పేరు చెప్పి దోచుకుంటూ రాష్ట్రాన్ని మరో సూడాన్, శ్రీలంక చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందా బాల, వెంకటరెడ్డి, నాయిని యానాదిరెడ్డి, దామర్ల గణేష్, డీవీ రమణ, రాజశేఖర్ పాల్గొన్నారు.


