ప్రభుత్వ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సీఎండీ శివశంకర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మరింత మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు స్మార్ట్ మీటర్లను ఆమర్చడం జరుగుతోందన్నారు. సంస్థ పరిధిలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 16,802 తిరుపతి జిల్లాలో 19,460, చిత్తూరు జిల్లాలో 13,871, అన్నమయ్య జిల్లాలో 13,311, కడప జిల్లాలో 16,829, అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717, కర్నూలు జిల్లాలో 10,457, నంద్యాల జిల్లాలో 9,836 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు తెలిపారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, ప్రీ–పెయిడ్ మీటర్లకు రీచార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, తదనుగుణంగా విద్యుత్‌ను ఆదా చేయడంతో బిల్లును కూడా తగ్గించుకోచ్చన్నారు. అలాగే విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామన్నారు.
డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు
ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు అందాయని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సంస్థ డైరెక్టర్లు గురవయ్య, పి.అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఆర్ పద్మ, జే రమణాదేవి, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, కే సంపత్ కుమార్, సీహెచ్ రామచంద్ర రావు, జనరల్ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్, చక్రపాణి, లత తదితరులు పాల్గొన్నారు.


