పూజా మండపాల్లోనే నాగపడగలు
– కౌంటర్లలో పూజా సామగ్రి మాత్రమే పంపిణీ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. నాగపడగల గోల్‌మాల్ వ్యవహారంపై గురువారం సాక్షి దినపత్రికలో ‘రాహు–కేతులనే మింగేస్తున్నారు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై ఆలయాధికారులు, పాలక మండలి స్పందించింది. రాహు–కేతు టికెట్ల కౌంటర్లలో పూజా సామగ్రి మాత్రమే పంపిణీ చేస్తోంది. నాగపడగలను ఆయా పూజా మండపాల్లో భక్తులకు అందజేస్తున్నారు. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక టికెట్ మాత్రమే విక్రయిస్తున్నారు. పైగా దీనిపై ఉదయం నుంచి మైకుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పూజ అయిన వెంటనే ప్రత్యేక క్యూలైన్‌న్‌లో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
నాయుడుపేట టౌన్: పట్టణంలోని లక్ష్మణ్ నగర్‌లో నివాసమున్న స్రవంతి ఒకటిన్నరేళ్ల కుమార్తె లాస్యపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. చిన్నారి లాస్య ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పక్కనే ఓ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో అక్కడ ఉన్న మహిళలు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని కుక్కల బారి నుంచి కాపాడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. లక్ష్మణ్ నగర్‌లో తరచూ ఇక్కడి కుక్కలు అనేక మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని స్థానిక మహిళలు రోధిస్తూ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం చెక్ పోస్టు వద్ద గురువారం అక్రమంగా కారులో తరలిస్తున్న 28 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారు పైలెట్ వాహనంగా వినియోగించిన ద్విచక్రవాహనంతోపాటు కారును సీజ్ చేశారు. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్‌ఐ కృపానంద టీమ్, స్థానిక ఎఫ్‌బీఓ ఆదిశేషయ్యతో కలసి నెల్లూరు– గూడూరు మార్గంలో వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు. వెంకటాచలం చెక్ పోస్టు వద్దకు చేరుకోగా, ఒక మోటారు సైకిల్‌లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారితో పాటు వెనకే వస్తున్న ఒక కారును అడ్డగించి, నిలిపారు. కారును ఆపిన వెంటనే అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్ ఫోర్సు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కారులో తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఆ నలుగురు వ్యక్తులను నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూజా మండపాల్లోనే నాగపడగలు


