అభిషేకం రద్దు .. అవస్థలమయం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయంలో శనివార అభిషేకాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో భక్తులు తిప్పలు పడ్డారు. శనివారం ఆరుద్ర నక్షత్రం ఉండడంతో శనీశ్వర అభిషేకాలు చేయించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆలయాధికారులు ముందస్తు సమాచారం లేకుండా శని అభిషేకాలు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తెలిసి ఉంటే భక్తులు శని అభిషేకం కోసం ప్రత్యేకంగా వచ్చి ఉండేవారు కాదని కానీ ఆలయాధికారుల సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆరుద్ర నక్షత్రంలో శని తైలాభిషేకం నిర్వహిస్తే మంచిదని విచ్చేసిన భక్తులకు నిరాశ ఎదురైంది.
ఆలయంలో కనిపించని అలంకరణ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మదినమని..ఆ రోజున శివయ్యను దర్శించుకుంటే మహా శివరాత్రిరోజు శివయ్యను దర్శించకున్నంత పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకులు, తమ జన్మదినానికి ఊరంత ఫ్లెక్సీలు కట్టి, అరటి చెట్లు, మామిడి తోరణాలు కట్టి చేసుకుంటున్నారు. కానీ పరమశివుని జన్మదినం అయిన ఆరుద్ర నక్షత్రంలో గుడిలో అలంకరణలు వెలవెలబోయాయి. ఇంత ప్రత్యేకమైన రోజు బంతిపూలు నాలుగు కట్టి మమ అనిపించేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


