ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Dec 11 2025 9:57 AM | Updated on Dec 11 2025 9:57 AM

ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం

● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్‌ రెడ్డి

చంద్రగిరి : చదువుల ఒత్తిడిని భరించలేకనే మహీధర్‌రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆ విషయం పక్కదారి పట్టించేందుకు నారాయణ కాలేజీ యాజమాన్యం నాటకాలు ఆడుతోందని వెఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి విమర్శించారు. రెండు చేతులు కూడా సక్రమంగా పట్టని కిటికీ నుంచి విద్యార్థి కిందకు దూకాడని చెబుతున్నారంటే వీరిని ఏమనాలి..? నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. చంద్రగిరి మండలం అగరాల వద్దనున్న నారాయణ విద్యాసంస్థలో అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన మహీధర్‌రెడ్డి అనే విద్యార్థి ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ యువకుడు రక్తపు గాయాలతో పడుండగా కాలేజీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతడు కిటికీలో నుంచి బయటకు వచ్చి పైపుల ద్వారా కిందకు దిగే ప్రయత్నంలో కిందపడి దెబ్బలు తగిలినట్టు బుకాయిస్తున్నారన్నారు. ప్రాణాలకు తెగించి అన్నం కోసం బయటకు వెళతారా ? కాలేజీ సిబ్బంది చెబుతున్న మాటలు చూస్తుంటే అనుమానంగా ఉందని, ఆ పిల్లాడిపై చదువుల ఒత్తిడి తేవడం వల్లనే తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోందన్నారు. నిజాలు బయటకు రావాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, నారాయణ విద్యాసంస్థల యజమాని రాష్ట్ర మంత్రి కావడం వల్ల పోలీసులు ఆ కేసును అణగదొక్కుతారు తప్ప లోతుగా విచారణ చేపట్టరని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల సంఘం నుంచి పోరాడుతామని, అవసరమైతే న్యాయ స్థానాల్లో కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్‌, ఎస్వీయూ అధ్యక్షు ప్రేమ్‌కుమార్‌, ఆర్సీపురం అధ్యక్షులు యశ్వంత్‌రెడ్డి, ఎర్రవారిపాళ్యం అధ్యక్షులు శేషారెడ్డి, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ విద్యార్థి నేత సుందర్‌, బీఎన్‌ఎస్‌ విద్యార్థి సంఘం నేత విక్రమ్‌ యాదవ్‌, బీసీ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు తిరుమలేశులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement