రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
తిరుపతి రూరల్ : రాష్ట్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. బకాయిలు ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టులు చేయించడం చంద్రబాబు ఫాసిస్ట్ పాలనకు నిదర్శనమన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫీజుల బకాయిలపై శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యతో పాటు ఇతర విద్యార్ధులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమం ఆగదని, ఫీజులు చెల్లించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ , చంద్రగిరి మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, ఆర్సీపురం మండల అధ్యక్షుడు, యశ్వంత్ రెడ్డి, ఎర్రావారిపాళెం మండలం అధ్యక్షుడు శేష రెడ్డిలతో పాటు విద్యార్థి నాయకుడు ముని తదితరులు పాల్గొన్నారు.


