63,178 స్మార్ట్‌ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి? | - | Sakshi
Sakshi News home page

63,178 స్మార్ట్‌ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి?

Dec 12 2025 6:03 AM | Updated on Dec 12 2025 6:03 AM

63,17

63,178 స్మార్ట్‌ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి?

తిరుపతి అర్బన్‌: చంద్రబాబు సర్కార్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపో యినప్పటికీ.. తమ మార్కు కోసం రాజకీయ కోణంలో భాగంగా ప్రశాంతంగా ఉన్న అనేక విభాగాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో స్మార్ట్‌ రేషన్‌కార్డుల అంశం ఒకటి. గతంలో ఉన్న పాత రేషన్‌కార్డుల స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 16 నుంచి కొత్తగా స్మార్ట్‌ రేషన్‌కార్డుల పేరుతో పసుపు రంగుతో కూడిన కార్డుల పంపిణీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. జిల్లాలో 1,457 చౌకదుకాణాల్లో 5,64,567 రేషన్‌కార్డులు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 5,01,389 కార్జులు జారీ చేశారు. ఇంకా 63,178 కార్డులను జారీ చేయాల్సి ఉంది.

కొత్తకార్డుల దరఖాస్తుకు స్మార్ట్‌ ఏదీ

కొత్తగా 70 వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారికి స్మార్ట్‌ రేషన్‌కార్డులు రాలేదు. ప్రధానంగా ఏటా పెద్ద కుటుంబాల్లో ఉంటున్న అన్నదమ్ములు వివాహం అనంతరం విడిపోయి, కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 20 వేల నుంచి 22 వేల మంది ఉన్నారు. అలాగే వివాహం కావడంతో తల్లిదండ్రుల కార్డుల నుంచి ఆడబిడ్డలు భర్త కార్డులో చేర్చడం కోసం దరఖాస్తులు చేసుకున్నవారు, పుట్టిన చిన్నబిడ్డలను ఏడాది తర్వాత రేషన్‌కార్డుల్లో చేర్చడానికి దరఖాస్తులు చేసుకున్నవారు, మృతి చెందిన వారిని కార్డు నుంచి పేరు తొలగించాలని దరఖాస్తులు చేసుకున్నారు. అడ్రస్‌ మార్పు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు.. ఇలా వివిధ రకాలుగా దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు జిల్లాలో 48వేల మంది ఉన్నారు. మొత్తంగా 70 వేల మంది సవరణల్లో భాగంగా కొత్త రేషన్‌కార్డుల్లో భాగంగా స్మార్ట్‌ రేషన్‌కార్డులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈకేవైసీ పేరుతో చాలమందికి బియ్యం అందడంలేదు. మరోవైపు అదనంగా డీలర్లుకు ఇవ్వాల్సిన 20 శాతం బియ్యం ఇవ్వకపోవడంతో ఏ డీలర్‌ పరిధిలోని కార్డుదారులు ఆ డీలర్‌ వద్ద బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు 1నుంచి 18 వరకు ఇస్తున్న బియ్యాన్ని 1 నుంచి 15 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఎండీయూ వాహనాలు రద్దు చేశారు. 288 డీలర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. బియ్యం తప్ప కందిపప్పుతోపాటు ఇతర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు నానా తిప్పులు పడుతుంటే..కొత్తగా స్మార్ట్‌ కార్డు ఇబ్బందులు తప్పడం లేదు.

పంపిణీకి నోచుకోని 63,178 కార్డులు ఎవరి వద్ద ఉన్నయో తెలియక కార్డుదారులు అయోమయంలో పడ్డారు. మొన్నటి వరకు రేషన్‌ డీలర్ల వద్ద ఉండేవి. తర్వాత సచివాలయానికి పంపించాం..అక్కడికి వెళ్లి తీసుకోండి అంటున్నారు. తాజాగా వీఆర్వోల వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు తహసీల్దార్‌ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు చివరిగా ఏ డీలర్‌ వద్ద బియ్యం తీసుకున్నారో ఆ డీలర్‌ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఉదాహరణకు ఓ కార్డుదారుడికి రేణిగుంట రేషన్‌ షాపు పరిధిలో కార్డు ఉంటే అతను తిరుపతిలో ఏదో ఒక డీలర్‌ వద్ద చివరి నెల(సెప్టెంబర్‌)బియ్యం తీసుకుని ఉంటే ఆ డీలర్‌ వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయానికి మిగులు కార్డులను పంపిణీ చేసినట్లు చర్చసాగుతోంది. ఈ గందరగోళంతో పలువురు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు తీసుకోలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 63,178 కార్డులు ఉంటే వాటిని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పంపిణీ చేయని కార్డులను వెనక్కి పంపుతాం

ఇప్పటికీ పంపిణీ చేయని స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జిల్లాలో 60 వేలకు పైగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరాయి. త్వరలో తీసుకోండి.. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేస్తాం. వాటిని వెనక్కి పంపాల్సి వస్తుంది. కొత్తకార్డులకు స్మార్ట్‌ కార్డులు త్వరలో వస్తాయి. పక్క డీలర్‌ వద్దకే కాకుండా రాష్ట్రంలో ఏ డీలర్‌ వద్దకు వెళ్లిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. – శేషాచలం రాజు,

జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

63,178 స్మార్ట్‌ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి? 1
1/1

63,178 స్మార్ట్‌ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement