పలువురు తహసీల్దార్ల బదిలీ
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలువురు తహశీల్దార్లను బదిలీచేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి రూరల్ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న రామాంజులునాయక్‌ను కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీచేశారు. ఆ స్థానానికి శ్రీకాళహస్తి తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న జనార్ధన్‌రాజును బదిలీచేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈ–సెక్షన్ సూపరింటెండెంట్‌గా ఉన్న డి.లక్ష్మీనారాయణను బీఎన్ కండ్రిగకు, అక్కడ పనిచేస్తున్న తహశీల్దారు శ్రీదేవిని సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన సౌలభ్యం కింద వారిని బదిలీ చేసినట్టు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పైపుల లారీ బోల్తా
రేణిగుంట : మండలంలోని గాజులమండ్యం సమీపంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాళహస్తి నుంచి చైన్నె వెళ్తున్న పైపుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ నాగరాజు చేరుకొని క్రేన్ల సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
డక్కిలి : బైక్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని వెంకటగిరి– రాపూరు జాతీయ రహదారిలోని లింగసముద్రం దళితవాడకు చెందిన గోనుగొడు వెంకటరామయ్య (60) అనే వృద్ధుడిని వెంకటగిరి నుంచి మాధవాయిపాళెం వైపు వెళ్తున్న కరిపం శివ అనే యువకుడు బైక్‌తో ఢీకొనడంతో వెంకట రామయ్య తీవ్రంగా గాయపడ్డారు. 108లో వెంకటగిరి సీహెచ్‌సీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు డక్కిలి ఇన్‌చార్జి ఎస్‌ఐ కామినేని గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివ తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం.
ప్రొఫెసర్లకు వైద్య పరీక్షలు పూర్తి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈమేరకు బుధవారం అధ్యాపకులు లక్ష్మణ్ కుమార్, శేఖర్‌రెడ్డిలను వైద్య పరీక్షల నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెస్ట్ పోలీసులు కోర్టులో హాజరుపరచినట్లు సమాచారం.
పలువురు తహసీల్దార్ల బదిలీ


