గ్యాస్ బిల్లు అధికంగా వసూలు చేస్తే చర్యలు
తిరుపతి తుడా : గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య.. గ్యాస్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం ఆమె నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్‌ఎస్ పాజిటివ్ ప్రిస్క్రిప్షన్ సర్వే మీద జిల్లాలో 28 గ్యాస్ డీలర్లపై ఎక్కువ పాజిటివ్ కాల్స్ వచ్చాయన్నారు. గ్యాస్ డీలర్లకు సంబంధించిన గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఐవీఆర్‌ఎస్ నివేదికలు తేల్చాయన్నారు. ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ బాయ్స్‌కు నియమ నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఇలాంటివి జిల్లాలో పునరావృతం అయితే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి మరోసారి బాంబు బెదిరింపు
చంద్రగిరి : శ్రీవేంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. యూనివర్సిటీకి చెందిన ఈ–మెయిల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్, బాంబ్ విచ్చిన్నకర బృందాలు వర్సిటీ పరిసరాల్లో సోదాలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, చెత్త కుండీలు, చెట్ల పొదలు తదితర ప్రాంతాలను జల్లెడ పట్టారు. చివరకు అది ఫేక్ మెసేజ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తరహాలో నెల రోజుల కిందట కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
13న జాతీయ లోక్ అదాలత్
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో 13వ తేదీ శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం. గురునాథ్ తెలిపారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు తిరుపతి కోర్టు ఆవరణలో ఈ జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు బుధవారం న్యాయమూర్తి పేర్కొన్నారు. లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం కోసం ఎనిమిది బెంచులను ఏర్పాటు చేయనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్లో సివిల్, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు, రెవెన్యూ, వాజ్యం వేయని కేసులు, ఇతర కేసులను పరిష్కరిస్తామన్నారు. కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు,పోలీసు అధికారులు, ఇతర అధికారులు సహకరించాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,901 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,128 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
గ్యాస్ బిల్లు అధికంగా వసూలు చేస్తే చర్యలు
గ్యాస్ బిల్లు అధికంగా వసూలు చేస్తే చర్యలు


