పంచాయతీలు.. విభజన వ్యూహాలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలు.. విభజన వ్యూహాలు

Dec 8 2025 8:16 AM | Updated on Dec 8 2025 8:16 AM

పంచాయ

పంచాయతీలు.. విభజన వ్యూహాలు

● స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలకు సాధారణంగా 10 వేలకు పైగా జనాభా ఉండడంతోపాటు ఏడాదికి రూ.కోటికిపైగా ఆదాయం రావాల్సి ఉంది. ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) ఏరియాలో అయితే 5వేలకు పైగా జనాభా ఉండాలి. ఆదాయంతో పనిలేదు. ● గ్రేడ్‌–1 పంచాయితీ సాధారణ ఏరియాలో 3వేలకు పైగా 10 వేల లోపు జనాభా ఉండాలి. ఆదాయం రూ.30 లక్షలకు పైగా రూ.కోటి లోపు ఉండాలి. అలాగే మండల కేంద్రంగా పంచాయతీగా ఉండాలి, అలాగే ఐటీడీఏ ఏరియాలో అయితే 2500కు పైగా 5వేలకు లోపు జనాభా ఉండాలి, మండల కేంద్రంగా పంచాయతీ ఉండాలి. ఆదాయంతో పనిలేదు. ● గ్రేడ్‌–2 పంచాయతీల్లో సాధారణ ఏరియాలో 2వేలకు పైగా 3 వేలకు లోపు జనాభా ఉండాలి. ఆదాయంతో పనిలేదు. ఐటీడీఏ ఏరియాలో అయితే 1500కు పైగా 2500 లోపు జనాభా ఉండాలి. ఆదాయంతో పనిలేదు. ● గ్రేడ్‌–3 పంచాయతీలు సాధారణ ఏరియాలో 2 వేల లోపు జనాభా ఉండాలి. ఐటీడీఏ ఏరియాలో అయితే 1500లోపు జనాభా ఉండాలి. ఆదాయంతో పనిలేదు.

పంచాయతీల వర్గీకరణపై ఫోకస్‌

పంచాయతీల్లో మార్పులు.. చేర్పులకు కసరత్తు

జిల్లా వ్యాప్తంగా సాగుతున్న సర్వే

ప్రజా ప్రతినిధుల రాజకీయ జోక్యం

నెలాఖరునాటికి ప్రభుత్వానికి తుది జాబితా

ఫిబ్రవరి, మార్చిలో కొత్త పంచాయతీల వెల్లడి

గ్రామ పంచాయతీల విభజనకు బాబు సర్కారు వ్యూహం పన్నుతోంది. అందుకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయి సిబ్బందితో పచ్చనేతల కనుసన్నల్లో సర్వేలు జరిపిస్తోంది. ఈ నెలాఖరుకు ఈ తంతు ముగిస్తే.. తమ అనుకూల గ్రామాలు ఒక పంచాయతీలో.. వ్యతిరేక గ్రామాలను చీల్చి తలో పంచాయతీలో కలిపేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆపై ఎన్నికల క్రతువుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

జిల్లా సమాచారం

జిల్లాలో మొత్తం పంచాయతీలు 774

స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలు 15

గ్రేడ్‌–1 పంచాయతీలు 49

గ్రేడ్‌–2 పంచాయతీలు 145

గ్రేడ్‌–3 పంచాయతీలు 565

జిల్లాలో మండలాల సంఖ్య 34

అదనంగా జిల్లాలో చేరనున్న మండలాలు 3

జిల్లాలో రెవెన్యూ డివిజన్లు సంఖ్య 4

మున్సిపాలిటీలు 8

కార్పోరేషన్‌ 1 (తిరుపతి)

జిల్లా జనాభా 25.65 లక్షలు

తిరుపతి అర్బన్‌: వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీల వర్గీకరణకు తెరలేపింది. ఆ మేరకు జోరుగా ఏ పంచాయతీ మనవైపు...ఏ పంచాయతీ అటు వైపు అని సర్వే సాగిస్తున్నారు. ఈ నెలాఖరుకు సర్వే తంతు ముగియనుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కొత్త పంచాయతీల లెక్కలు ప్రకటించనున్నారు. అనంతరం ఏప్రిల్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పంచాయతీలపై ఫోకస్‌ పెట్టింది. పంచాయతీల్లో పట్టు సాధిస్తే ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చనే కోణంలో కసరత్తు మొదలు పెట్టినట్లు చర్చ సాగుతోంది. జిల్లాలో 774 పంచాయతీలున్నాయి. వీటిని ఎలా కుదించాలి, లేదా పంచాయతీలు పెంచాలా? ఏ గ్రామాన్ని ఏ పంచాయతీలో కలిపితే రాజకీయ ప్రయోజనం ఉంటుంది. మన పార్టీకి అనుకూలంగా ఉన్న పంచాచతీ ఏదీ? వ్యతిరేకంగా ఉన్న పంచాయతీ ఏదీ? ఏ పంచాయతీలో ఎలాంటి ఆర్థిక వనరులున్నాయి? అనే అంశాలపై జోరుగా సర్వే సాగుతోంది. ఈ క్రమంలో పంచాయతీల సంఖ్య తగ్గిపోతుందని కొందరు వాదిస్తుంటే.. పంచాయతీల సంఖ్య పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. అయితే పలు గ్రామాలు మాత్రం ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీలోకి మార్పు జరుగుతుందని చెబుతున్నారు. సాధారణంగా అయితే కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలంటే గ్రామ జనాభా, ఆర్థిక వనరులు, ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య దూరం, రెవెన్యూ వ్యవహారాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ, ఇతర సౌకర్యాలు తదితర అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కూటమికి చెందిన రాజకీయ నేతలు డైరెక్షన్‌లో కసరత్తు సాగుతున్నట్లు చర్చసాగుతోంది.

ప్రభుత్వ నిబంధనలిలా..

పంచాయతీల వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు చేపడితే అందరికీ అమోదయోగ్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే రాజకీయ కోణంలో వర్గీకరణ చేస్తే గందరగోళం తప్పదని, పెద్ద ఎత్తున పోరాటాలు చోటుచేసుకుంటాయని పంచాయతీ అధినేతలు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం

ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే జరుగుతోంది. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆమేరకు ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెలాఖరుకల్లా ఎంపీడీఓల నుంచి ప్రతిపాదనలు రానున్నాయి. అనంతరం తుది జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తాం. – సుశీలాదేవి, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీలు.. విభజన వ్యూహాలు1
1/2

పంచాయతీలు.. విభజన వ్యూహాలు

పంచాయతీలు.. విభజన వ్యూహాలు2
2/2

పంచాయతీలు.. విభజన వ్యూహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement