పేద మహిళ ఇంటి స్థలంపై టీడీపీ కార్యకర్త కన్ను
రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లిలో మైమూన్ అనే మహిళ తన కుమార్తె, మనవళ్లతో ఉంటోంది. ఇల్లు లేని మైమూన్‌కు దళితవాడకు చెందిన నండ్ర రత్నమ్మ తమ స్వాధీన అనుభవంలో ఉన్న భూమిలో 2 సెంట్లు ఇచ్చింది. అందులో ఐదేళ్ల క్రితం మైమూన్ రేకుల ఇల్లు నిర్మించుకుని ఇడ్లీ దుకాణం నడుపుతోంది. స్థానికంగా ఉండే టీడీపీ కార్యకర్త కన్ను ఆ స్థలంపై పడింది. అప్పటి నుంచి స్థలం తనదంటూ మైమున్ కుటుంబ సభ్యులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారుల ద్వారా మైమున్‌ను భయపెట్టారు. అధికారుల ఒత్తిడి ఎక్కువ కావడంతో మైమున్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సదరు ఇంటిపై స్టే విధించింది. అయినప్పటికీ టీడీపీ కార్యకర్త రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఉపయోగించి ఆ మహిళను తీవ్ర మనోవేదనకు గురిచేశారు. ఇటీవల మైమున్‌కు చెయ్యి విరగడంతో వైద్యం చేయించుకునేందుకు పుత్తూరుకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన టీడీపీ కార్యకర్త..రెవెన్యూ అధికారులను పంపించి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె రేకుల ఇల్లును నేలమట్టం చేయించాడు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న మైమూన్ కుటుంబ సభ్యులు జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించారు. ఇంటి శిథిలాల కింద పడి ఉన్న సామాన్లను ఎత్తుకుంటూ..ఎవరూ లేని సమయంలో ఇలా తమ ఇంటిని కూల్చివేయడం అన్యాయమని వాపోయారు.
పేద మహిళ ఇంటి స్థలంపై టీడీపీ కార్యకర్త కన్ను


