శబరిమల యాత్రలో అపశ్రుతులు
చిల్లకూరు: తిరుపతి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అయ్యప్పస్వామి భక్తుల శబరిమల యాత్రలో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు బోల్తా పడగ, మరో ఘటనలో కారు కల్వర్టును ఢీకొని నుజ్జునుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. భక్తిభావంతో అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు బయలు దేరిన భక్తులు ప్రయాణించే బస్సు బోల్తా పడడంతో పలువురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన చిల్లకూరు మండలం రైటార్ సత్రం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు, గురుజాల నుంచి సుమారు 40 మంది అయ్యప్ప భక్తులతో ప్రైవేటు ట్రావెల్ బస్సు శనివారం రాత్రి శబరిమలకు బయలు దేరింది. ఈ క్రమంలో బస్సు మండలంలోని రైటార్ సత్రం వద్దకు వచ్చే సరికే ముందు ఆపి ఉన్న లారీని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు బస్సు ఒరిగి పోవడంతో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలు కాగా ఆదినారాయణ, కోడేల సతీ్‌ష్, నాగేశ్వరరావుకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం భక్తుల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయ్యప్ప భక్తులు సమీపంలో ఉన్న అమరావతి హోటల్‌లో సేద తీరారు. అనంతరం మరో బస్సు వచ్చిన తరువాత వారు శబరిమలకు బయలు దేరి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కల్వర్టును ఢీకొన్న అయ్యప్ప భక్త బృందం కారు
చంద్రగిరి: శబరిమల యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతున్న కారు కల్వర్టును ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అయ్యప్పస్వామి భక్తులు గాయపడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రైల్వేకోడూరుకు చెందిన అయ్యప్ప స్వాములు, శబరిమల యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం తమ కారులో రైల్వే కోడూరుకు పయనమయ్యారు. అగరాల వద్ద వస్తుండగా కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడం కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది. దీంతో కారు గాల్లో ఎగిరి పడి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాయికుమార్, అజయ్‌కుమార్, జస్వంత్, మణికంఠ, నితీష్, యోగేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. వీరిలో సాయికుమార్‌కు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శబరిమల యాత్రలో అపశ్రుతులు
శబరిమల యాత్రలో అపశ్రుతులు


