నేరాలకు పాల్పడితే సహించం
● గూడూరుకు చెందిన షేక్ కాలేషా (33)పై ఇప్పటికే వివిధ నేరాలకు సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. గూడూరు, వాకాడు, గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్, దర్గామిట్ట, వెంకటాచల సత్రం, వేదాయపాళెం పోలీస్ స్టేషన్లలో గంజాయి, మాదకద్రవ్యాలు, హత్యా, నేరపూరిత అతిక్రమణ, ఆస్తికి నిప్పు పెట్టడం, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి.
● గూడూరు పట్టణానికి చెందిన కనుమూరు శ్రీహరి అలియాస్ జెమిని(38)పై 6 కేసులు నమోదయ్యాయి. గంజాయి, హత్య, దొమ్మీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
● తిరుపతి మారుతీనగర్‌కు చెందిన సయ్యద్ అజీమ్(30)పై 14 కేసులు ఉన్నాయి. ఈస్ట్, అలిపిరి, వెస్ట్, ఎమ్మార్‌పల్లె, యూనివర్సిటీ, తిరుచానూరు మహిళా పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, దొమ్మీ, దొంగతనం, కిడ్నాప్, దౌర్జన్యం, గంజాయి, రౌడీయిజం కేసులు నమోదయ్యాయి.
● చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన వట్టికుంట అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్(32పై అలిపిరి, రామకుప్పం, సంబేపల్లె, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్య, కిడ్నాప్, దౌర్జన్యంగా లాక్కోవడం వంటి కేసులు ఉన్నాయి.
● నెల్లూరు నగరానికి చెందిన మిధూరి సునీల్(29)పై మొత్తం 34 కేసులు ఉన్నాయి. శ్రీకాళహస్తి టూ టౌన్, వన్‌టౌన్, తొట్టంబేడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కడప జిల్లా పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు, వరకట్నం వేధింపులు, మట్కా కేసులు నమోదయ్యాయి.
● సూళ్లూరుపేటకు చెందిన ప్రసన్నకుమార్(32)పై 18 కేసులు నమోదయ్యాయి. దొరవారి సత్రం, చిలుకూరు, ఓజిలి, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లతో చోరీలు, హత్యాయత్నాలు, గంజాయి కేసులు ఉన్నాయి.
తిరుపతి క్రైమ్ : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, తరచూ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పోలీసు అతిథిగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదన్నారు. పీడీ యాక్టు నమోదు చేసినవారు డ్రగ్స్ విక్రయం, హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై అఘాయిత్కాలు, స్మగ్లింగ్, దోపిడీలు, రౌడీయిజం, భూకబ్జాల వంటి నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. సమాజానికి ఇబ్బందికరంగా మారిన ఈ ఆరుగురిపై కలెక్టర్ సిపార్సు మేరకు పీడీ యాక్టు పెట్టినట్టు తెలిపారు. మరికొందరిపై కూడా త్వరలోనే పీడీ యాక్టు నమోదు చేసే అవకాశముందని చెప్పారు. ఇప్పటికై నా నేరస్తులు సన్మార్గంలోకి రావాలని సూచించారు. భూకబ్జాలకు తెగబడే వారిపై సైతం నిఘా పెట్టామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీడీ యాక్టు నమోదు చేసిన ఆరుగురు నేరగాళ్లు వివరాలు ఇలా..