శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,004 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,900 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
పల్లెల్లో ఏనుగుల భయం
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని అటవీ సమీప పల్లెల్లో ఏనుగుల భయంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెండు మూడు రోజులుగా గజరాజులు భాకరాపేట పరిసరాల్లో సంచరిస్తుండడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో టమాట, మామిడి, అరటి, వరి పంటలన నాశనం చేసేడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏనుగుల ఘీంకారలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను దారి మళ్లించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.
చీటీ డబ్బులు కట్టలేదని దూషణ
– వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కలువాయి(సైదాపురం): చీటి డబ్బులు కట్టలేదని అసభ్యకర పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో జంగాలపల్లి కాలనీకి చెందిన విక్రమ్ అదే గ్రామానికి చెందిన జాతి కత్తుల చిట్టయ్య వద్ద చీటీ వేశాడు. ప్రతి నెలా కట్టాల్సిన చీటీ నగదు కట్టడం ఆలస్యం కావడంతో కత్తుల చిట్టయ్య సోమవారం విక్రమ్ ఇంటికి వెళ్లి దూషించాడు. దీంతో విక్రమ్ పురుగుల మందు తాగేశాడు. కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్రమ మద్యం విక్రేత అరెస్ట్
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని బేరిపేట సెంటర్‌లో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న కూల్‌డ్రింక్ షాపు యజమాని మూనుకూరు భాస్కర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ బాబీ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భాస్కర్ గతంలో సింగిల్ నంబర్లు లాటరీలు నిర్వహిస్తుండడంతో కేసులు సైతం నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భాస్కర్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా తమిళనాడుకు చెందని 25 సీసాల మద్యం, ఏపీకి చెందిన 38 బాటిళ్ల మద్యం పట్టుబడినట్లు వివరించారు. బేరిపేటకు చెందిన రవి అనే వ్యక్తితో కలిసి అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సోమవారం నాయుడుపేట కోర్టులో నిందితుడిని హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు


