అర్జీదారుల అసంతృప్తి
అలసత్వంపై
అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కార వేదికపై అధికారులు అలసత్వం వహిస్తున్నారు. వివిధ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారికి అధికారి ముందు కూర్చుని మాట్లాడే వెసులుబాటును కూడా కల్పించడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్‌లో చేపట్టిన గ్రీవెన్స్ కార్యక్రమం 11.30 గంటలకే ఖాళీగా మారింది. కేవలం 313 అర్జీలు మాత్రమే వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్‌ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, శివశంకర్ నాయక్, సుధారాణి తదితరులు అర్జీలను స్వీకరించారు.
చాలీచాలని వసతులు
గ్రీవెన్స్‌కు 60 నుంచి 65 విభాగాలకు చెందిన అధికారులు హజరవుతుంటారు. అంటే వాళ్ల ఎదురుగా 60 నుంచి 65 కుర్చీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సోమవారం మాత్రం కేవలం 15 మంది అధికారుల ముందు 15 కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగిలిన అధికారుల ముందు నిలబడే సమస్యను అధికారి చెప్పాల్సి వచ్చింది. చాలీచాలని వసతులు కల్పించడంపై పలువురు అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు.
గేటు వద్దే అడ్డగింత
ఇటీవల కలెక్టరేట్ వద్ద వరుసగా నిరసనలు, ధర్నాలు ఎక్కువయ్యాయి. కొందరు పెట్రోల్ బాటిళ్లు తీసుకువచ్చి ఒంటిపై పోసుకున్నారు. దీంతో సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చిన వారిని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఎంతమంది వచ్చినా ఒకరిద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో చాలామంది కలెక్టరేట్ గేటు వద్దే నిలబడిపోయారు. గ్రీవెన్స్‌కు ప్రజలను లోపలికి రానివ్వకపోవడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


