ప్రాణం తీసిన మద్యం మత్తు
– చెరువులో పడి జార్ఖండ్ వాసి మృతి
పాకాల : అతి మద్యం తాగి మత్తులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రం, జనతాడ జిల్లా, కమోడి గ్రామానికి చెందిన మాణిక్ బోరి(40) దామలచెరువు సమీపంలోని ఇటుకల బట్టీలో తన బంధువులతో కలిసి పని చేసేవాడు. శనివారం ఇటుకల బట్టీ యజమాని లెక్కలు చూసి మాణిక్‌కు రావలసిన డబ్బు అందజేశాడు. అదే రోజు రాత్రి దామలచెరువు మ్యాంగోనగర్ గేటులో వద్ద దుకాణంలో మద్యం కొనుగోలు చేసిన మాణిక్ లింగం చెరువు పక్కన బంధువులతో తాగాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా మాణిక్ మరికొంత మద్యం తాగి వస్తానని ఉండిపోయాడు. ఈ క్రమంలో సోమవారం మాణిక్ మృతదేహం చెరువులో తేలింది. మద్యం మత్తులోనే చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


