గుట్టుగా మెడికల్ షాపుల ప్రారంభం
తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర విభాగం వద్ద రెండు మెడికల్ షాపుల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 1988 నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీఓను చూపించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఈ) అధికారులు అన్నపూర్ణ మెడికల్స్ సంస్థకు దొడ్డిదారిలో రెండు షాపులను కేటాయించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక భారీ మొత్తం చేతులు మారిందనే చర్చ అధికార పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి అల్లుడు బినామీలకు మంత్రి ద్వారా డీఎంఈలో పావులు కదిపి మరో నాలుగేళ్లపాటు మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు ఆదేశాలు తెచ్చుకున్నారు. రుయా అధికారుల అభిప్రాయాలకు తావు లేకుండా నేరుగా డీఎంఈ ఆర్డర్ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆ మెడికల్ షాపులకు సంబంధించి అద్దె ఖరారు కాకుండానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. మూడో కంటికి తెలియకుండా శనివారం మెడికల్ షాపుల ప్రారంభోత్సవం జరిగిపోయింది. మెడికల్ షాపులకు అద్దె నిర్ణయించాలంటూ రుయా అధికారులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అద్దె ఖరారు చేసి రుయాకు సదరు కాపీలను పంపించాల్సి ఉంది. ఆ ప్రకారం అద్దెను నిర్ణయించాక మెడికల్ షాపులను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే, అద్దె ఖరారు కాకుండానే షాపులను ప్రారంభించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రుయా అధికారులు వైద్యులు సైతం అవాక్కవుతున్నారు.రుయా అధికారులను మెడికల్ షాపుల యజమానులు కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. మంత్రి అండ దండలతో నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉచిత మందులు హుళక్కే!
ప్రభుత్వాస్పత్రులో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు, సర్జికల్స్‌లను సర్కారు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ మందులు అన్ని ఉచితంగానే రోగులకు అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. ఎక్కడైనా రోగులకు అవసరమైన మందులను బయటకు రాసినట్లు తెలిస్తే వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయి. మందుల కోసం రోగులను ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపకూడదనే నిబంధన ప్రస్తుతం కఠినంగా అమలవుతోంది. ఈ క్రమంలో రుయా అత్యవసర విభాగం వద్ద రెండు ప్రైవేటు మెడికల్ షాపులను ఏర్పాటు చేయడంపై వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రుయాలోకి వచ్చే రోగులు ఒక్క మెడిసిన్ కూడా బయట కొనకూడదు, అలాంటప్పుడు రుయా అత్యవసర విభాగం వద్ద రెండు ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


