దేవుడి పేరిట దరా్జగా కబా్జ!
తిరుపతి అర్బన్ : తిరుపతి నడిబొడ్డున అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి చెందిన స్థలంలో సాక్షాత్తు ఓ రెవెన్యూ అధికారే ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టారు. ముందుగా రెండు సెంట్లు స్థలంలో చిన్నపాటి వెంకటేశ్వరస్వామి మందిరం కట్టారు. క్రమేణా ఆలయ విస్తరణ పేరుతో 5 సెంట్లు ఆక్రమించి నిర్మాణ పనులు సాగిస్తున్నారు. పైగా ఆలయం పేరు చెప్పి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం తమ వద్దకు వచ్చేవారిని ఆలయ హుండీలో నగదు వేయాలని...విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాహనాల మళ్లింపు
అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తూర్పు వైపున తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం, ఉత్తరం వైపు సివిల్ సప్లయి ఆఫీస్, దక్షిణం వైపున డీఆర్‌డీఏ, డ్వామా కార్యాలయాలు, పడమటి వైపు యూత్ హాస్టల్ ఉన్నాయి. సమీప ప్రాంతంలో జీఎస్టీ కార్యాలయం, గ్రంథాలయం, సెరికల్చర్, మెప్మా తదితర శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం మీదుగా నిత్యం పెద్దసంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అయితే పలు సందర్భాల్లో ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ఆ రోడ్డును బ్లాక్ చేస్తున్నారు. సివిల్ సప్లయి ఆఫీస్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రోడ్డు పైభాగంగా శాశ్వతంగా రేకులతో పందిళ్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం.
ఖాళీ స్థలంపై కూటమి నేతలు చూపు?
అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి ఉత్తరం వైపున సుమారుగా 50 సెంట్ల విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఇది సుమారు రూ.10 కోట్లు విలువ చేస్తుంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం చేపట్టినవారే ఈ స్థలంలో వాహన మండపం కట్టేందుకు యత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు కూటమి నేతలు సైతం ఈ స్థలాన్ని ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు తమ స్థలాన్ని కాపాడుకోవాల్సి ఉంది.
తహసీల్దార్ కార్యాలయం ఉత్తరం వైపు ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం
ప్రభుత్వ భూమిలో పేదలు చిన్నపాటి గుడిసె వేసుకుంటే ఆగమేఘాలపైన రెవెన్యూ అధికారులు వాలిపోతుంటారు. తీవ్రమైన నేరం చేసినట్లు హడావుడి చేస్తుంటారు. ఇల్లు పీకి పందిరేస్తుంటారు. బక్కజీవిని బలవంతంగా అక్కడ నుంచి నెట్టేస్తుంటారు. ఏది ఏమైనా సర్కారు స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది.. నిజమే కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే ఎవరైనా పెద్దవాళ్లు అదే భూమిలో పాగా వేస్తే మాత్రం అదే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. ఇక దేవుడి పేరుతో విలువైన స్థలాను కబళించినా కన్నెత్తి చూడరు. ఇదే ఇప్పుడు తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతోంది. ఆఫీస్‌కు చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టినా స్పందించే వారే కరువయ్యారు.


