వేటు వేసినా తగ్గేదేలే..!
చేయి తడిపితేనే క్రయవిక్రయాలు
సస్పెన్షన్లను పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్లు
పైరవీలతో మళ్లీ అదే స్థానంలో పోస్టింగులు
జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి అడుగు పెట్టాలంటేనే క్రయవిక్రయదారులు హడలిపోతున్నారు. అవినీతికి అలవాటు పడిన కొందరు సబ్ రిజిస్ట్రార్లతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంకణానికి ఇంత అని అడిగి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాసులు ముట్టజెప్పకుంటే నిబంధనల పేరుతో ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇచ్చేస్తే వివాదాస్పద భూములను సైతం ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. చివరకు సస్పెన్షన్ వేటు పడినా చలించకుండా పైరవీలు సాగించి మళ్లీ పోస్టులోకి వచ్చేస్తున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి జలగలు ప్రజల రక్తం పీల్చేస్తున్నాయని మండిపడుతున్నారు.
తిరుపతి అర్బన్ : జిల్లాలో 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే తిరుమల కార్యాలయంలో కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నారు. మిగిలిన 16 చోట్ల ఆస్తుల క్రయవిక్రయాలకు చెందిన రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. వీటిలో తిరుపతి అర్బన్, రేణిగుంట, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, గూడూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు దోపిడీ కేంద్రాలు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కాసులు ఇస్తే చాలు నిబంధనలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే వారికీ వాటాలు ముట్టజెప్పి నోరుమూయిస్తున్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా దోపిడీ
ప్రధానంగా తిరుపతి అర్బన్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా దోపిడీ సాగుతున్నట్లు క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంకణానికి ఎంత ఇస్తావ్ అంటూ ముందే బేరాలు చేసుకుంటున్నారు. డాక్యుమెంట్స్ రైటర్లు చేతుల మీదుగా మాత్రమే నగదును స్వీకరిస్తున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉన్నప్పటికి ఏదో ఒక తప్పు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మదర్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, సర్వే రిపోర్టు, ఇంటి నంబర్, టాక్స్, డెత్ సర్టిఫికెట్, కమర్షియల్ ప్లాట్స్ అంటూ నగదును అధికంగా వసూలు చేస్తున్నారు. అడిగినంత చెల్లించిన వారికి అన్ని డాక్యుమెంట్స్ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రైవేటు వ్యక్తులే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా పెత్తనం చలాయిస్తున్నారు. ప్రధానంగా మ్యారేజ్ సర్టిఫికెట్స్‌కు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాస్ట్‌పోర్ట్ పొందేందుకు ఫ్యామిలీ మెంబర్, మ్యారేజ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నారు. వెంటనే కావాలంటే రూ.2,500, వారం తర్వాత అయితే రూ.2వేలు అంటూ బేరాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఓ రెగ్యులర్ ఉద్యోగి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయన ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఉద్యోగులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
అవినీతికి అడ్డాగా
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
చర్యలను పట్టించుకోరు
రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనలకు విర్దుంగా రిజిస్ట్రేషన్లు చేయడంతో డీఐజీ గిరిబాబు ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ ఆనంద్‌రెడ్డి పలుమార్లు శాఖా పరమైన చర్యలకు గురైన విషయం విధితమే. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే రేణిగుంటలో పనిచేస్తున్న ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌కు గురికావడం జరిగింది. అయినప్పటికి సస్పెండ్ అయినవారంతా మళ్లీ సబ్‌రిజిస్ట్రార్లుగా పోస్టింగ్ సంపాదించుకున్నారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్లకు సస్పెన్షన్ అంటే లెక్కలేకుండా పోయింది. తిరుపతి, శ్రీకాళహస్తిలోను ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌కు గురైనప్పటికి మళ్లీ తిరిగి పోస్టింగ్‌ను సంపాదించుకోవడం గమనార్హం.
వేటు వేసినా తగ్గేదేలే..!


