చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం
●
చంద్రగిరి: తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిఽధిలోని రెడ్డివారిపల్లి, స్వర్ణముఖినది పరిసరాల్లో యువత లిక్విడ్ గంజాయి సేవించడం ఆదివారం కలకలం రేపింది. మండల పరిఽధిలోని రెడ్డివారిపల్లి, ఎగువరెడ్డివారిపల్లి, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల యువత లిక్విడ్ గంజాయిని సేవిస్తూ అలజడి సృష్టించారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్తున్న రైతులు గుర్తుతెలియని యువకులు లిక్విడ్ గంజాయి సేవించి, వదిలేసి వెళ్లిన బాటిళ్లను గుర్తించారు.
అత్యంత ప్రమాదకరమైన ద్రవం
ప్రాణాంతకమైన అత్యంత ప్రమాదకరమైన ఫైనల్ ప్రొడక్షన్ హాష్ అనే ప్రమాదకరమైన లిక్విడ్ గంజాయికి యువత బానిసలుగా మారారు. ముందుగా లిక్విడ్ గంజాయిని ఓ బాటిల్‌లో నింపి పొగబెట్టి, ఆపై వచ్చే ఆవిరిని పీల్చుతూ మత్తులో జోగుతున్నారు. ఇలా లిక్విడ్ గంజాయిని సేవించడం ద్వారా నరాల బలహీనత ఏర్పడడంతో పాటు అవయవాలు పూర్తిగా పాడైపోతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
రాత్రుల్లో వికృత చేష్టలు
లిక్విడ్ గంజాయిని సేవించిన యువకులు రాత్రుల్లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన రెడ్డివారిపల్లి ప్రధాన రహదారి వద్ద ఓ ఆటో డ్రైవరుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. తాము నైట్‌బీట్ పోలీసులంటూ వారిని బెదిరించడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఆపై ఆటో డ్రైవరు వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.7వేల నగదును ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని మందలించి వదిలేశారని తెలిసింది. అయితే ఆ యువకుడిపై గతంలో గంజాయి, హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల గంజాయి మత్తులో యువకులు అత్యంత వేగంగా వాహనాలను నడుపుతూ ప్రజలను భయభ్రాంతకులకు గురిచేస్తున్నారు. మునుపటిలా రాత్రుల్లో గస్తీని పటిష్టం చేయడం ద్వారా ఇలాంటి వాటిని అరికట్టవచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


