చేయి విరిగినా.. చలించలేదు!
● చంద్రగిరిలో ప్రైవేటు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం
చంద్రగిరి : ప్రైవేటు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి నరకయాతన అనుభవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చంద్రగిరి– తిరుపతి రహదారిలోని అరుణ కాలనీ సమీపంలో శ్రీచైతన్య పాఠశాల ఉంది. ఆ స్కూలు విద్యార్థి మహానాయక్ బుధవారం ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. బాలుడు ఏడుస్తున్నా పాఠశాల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు సాయంత్రం బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన స్కూలుకు వెళ్లి బాలుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థి ఎడమ చేయి విరిగిపోయినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్సలందించారు. అంతటి బాధతో బాలుడు ఏడుస్తున్నప్పటికీ పాఠశాల నిర్వాహకులు చలించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, శ్రీచైతన్య ఉపాధ్యాయులు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎంఈఓ లలిత కుమారి, పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అయితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా, సలహాలు ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


