20న జిల్లాకు రాష్ట్రపతి రాక
తిరుపతి అర్బన్ : రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ నెల 20వ తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 20వ తేదీ మధ్యాహ్నం 3.25 గంటలకు రాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. 4.30కి బయలుదేరి 5.20 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారని వెల్లడించారు. 21వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, 11.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నట్లు వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఆర్‌ఓ నరసింహులు, ఆర్‌డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీపీఓ సుశీలాదేవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌సీ రాజా నాయక్, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు పాల్గొన్నారు.
ప్రారంభమైన సమ్మెటివ్ పరీక్షలు
– నేటి నుంచి 1– 5వ తరగతులకు
తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్–1 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం 1– 5వ తరగతుల విద్యార్థులకు ప్రారంభంకానున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,217 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,000 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
సిరులు కురిపించే భూములు ఎడారిని తలపిస్తున్నాయి. పచ్చదనంతో విలసిల్లిన పంట పొలాలు ఇసుక మేటలతో నదీ తీరాలను గుర్తుకుతెస్తున్నాయి. ఓళ్లూరు రాయలచెరువు ఘటనతో ఎక్కడికక్కడ రాళ్లు చేరి వ్యవసాయాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ముంపు గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇన్నేళ్లుగా పోషించిన నేలతల్లి ధ్వంసం కావడంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.


