డ్రైవింగ్ స్కూల్‌లో 36వ బ్యాచ్‌కు శిక్షణ
తిరుపతి అర్బన్: తిరుపతి అలిపిరి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్‌లో సోమవారం 36వ బ్యాచ్‌కి శిక్షణ ప్రారంభించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ పూర్తి చేసుకున్న 35వ బ్యాచ్‌కి వీడ్కోలు పలికారు. ఒక్కో బ్యాచ్ కింద నామమాత్రపు ఖర్చులతో 16 మందికి శిక్షణ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే 36వ బ్యాచ్‌లో షెడ్యూల్ కులం సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 10 మందికి అవకాశం కల్పించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ హరిబాబు, ఈఈ నరసింహులు, మణి పాల్గొన్నారు.
నేడు ఇండస్ట్రియల్ పార్క్‌కు భూమి పూజ
వరదయ్యపాళెం: చిన్నపాండూరులో ఏపీఐఐసీ సెజ్‌లో 5.68 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా భూమి పూజ చేయనున్నట్లు ఏపీఐఐసీ జెడ్‌ఎం విజయ్ భరత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.16.78 కోట్లతో ప్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ)ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘పది’ పరీక్ష ఫీజుకు
25 వరకు గడువు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 25వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు అవకాశముంటుందని వెల్లడించారు.


