పవనానందం.. హాస్యాస్పదం
తిరుపతి మంగళం : ఉప్పొంగి ప్రవహించే నదిలో నీరు పోయడం.. దట్టమైన అడవిలో మొక్కలు నాటడం.. నల్లకళ్లజోడు ధరించి పుస్తకాలు చదవడం.. తిరుపతి, పలమనేరులో రెండు రోజులు పర్యటించిన అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అడవులపై అటవీశాఖ మంత్రికి ఏ మాత్రం అవగాహన లేదని అందరికీ తెలిసిందన్నారు. మామండూరు అడవుల్లో సినిమా షూటింగ్‌కు వచ్చి ఫోజులిచ్చినట్లు ఉందే తప్ప, ఏం తెలుసుకోవాలని వచ్చారో అర్థం కావడంలేదన్నారు. తిరుమల శ్రీవారికి గాయమైనప్పుడు నేలపై పడిన రక్తతో ఎర్రచందనం మొక్కలు పెరిగాయని, అందుకే అవి ఎర్రగా ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యాన్ని చాటుతోందని తెలిపారు. అరుదైన ఎర్రచందనం చెట్ల గురించి ఏమాత్రం తెలియని తొలి అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అయ్యుంటారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేల టన్నుల ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిపోకుండా పట్టుకుని భద్రపరిచామని వెల్లడించారు. రెండు రోజులు తిరుపతి, పలమనేరు పర్యటనకు రావడం ఏంటి? రాత్రి మళ్లీ హైదరాబాదుకు వెళ్లడం ఏంటి? తిరిగి ఉదయం మళ్లీ తిరుపతికి రావడం ఏంటని ప్రశ్నించారు.
జనసేన శ్రేణుల్లో అసంతృప్తి
రేణిగుంట ఎయిర్‌పోర్టులో తిరుపతి ఎమ్మెల్యే, పలమనేరులో అక్కడి ఎమ్మెల్యేని పట్టించుకోలేదని, ఇక జనసేన నేతలను నిర్లక్ష్యం చేశారని, దీనిపై ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రజలను కూడా చూసీచూడనట్టు వెళ్లిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీబీపురం మండలం ఓళ్లూరు రాయలచెరువు ఘటనలో బాధితులను కనీసం పరామర్శించేందుకు వెళ్లకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.


