అత్యంత అప్రమత్తత అవసరం
వాకాడు : మోంథా తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని, అధికారులందరూ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడం అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆదివారం వాకాడు మండలంలో మంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్‌లో వరద ఉధృతిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యారేజ్ గేట్లకు ఏమైనా మరమ్మతులు ఉంటే తక్షణమే చేయించాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు సుమారు 90 నుంచి 100 కిలోమీటర్లు వేగంతో గాలులు, అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదముందన్నారు. జిల్లాలో 75 కిలోమీటర్లు సముద్ర తీరం విస్తరించి ఉందని, అందులో చిల్లకూరు. కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట తీర ప్రాంత మండలాలు ఉన్నాయని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఈ ఐదు మండలాల్లో 60 నుంచి 70 కిటోమీటర్లు వేగంతో గాలులతోపాటు అతి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటు చేసుకోకుండా కంట్రోలు రూమ్‌లతోపాటు తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అవసరాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజులు పాటు ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చెరువుల పరిశీలన
ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లె, పల్లం చెరువులను కలెక్టర్ వెంకటేశ్వ, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలసి పరిశీలించారు. జంగాలపల్లె చెరువు కలుజు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రింగ్‌బండ్ కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పల్లం చెరువు కట్ట బలోపేతం చేయాలని సూచించారు. ఆర్‌డీఓ భానుప్రకాష్‌రెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ పాల్గొన్నారు.
స్వర్ణముఖి పొర్లు కట్టలను పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్
సురక్షిత ప్రాంతాలకు పరీవాహక ప్రజలు
కోట : స్వర్ణముఖి పొర్లుకట్టలు బలహీనంగా ఉన్న క్రమంలో పరీవాహక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆదివారం కోట మండలం దైవాలదిబ్బ, దొరువుకట్ట ప్రాంతంలో స్వర్ణముఖి నది పొర్లు కట్టలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కోతకు గురైన పొర్లు కట్టలకు మరమ్మతులు చేపట్టలేదని, భారీ వరదవస్తే 10 గ్రామాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు విన్నవించారు. దీంతో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. పొర్లు కట్టల ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. తహసీల్దార్ జయజయరావు, డీటీ మల్లికార్జున్ పాల్గొన్నారు.


