నిండిన జలాశయాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తుపాను ప్రభావం మూడు నుంచి ఐదు రోజులపాటు కొనసాగింది. దీంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండిపోయాయి. అలాగే చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. జిల్లా జలవనరుల శాఖ పరిధిలో మొత్తం ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో కల్యాణి డ్యామ్ 50 శాతం నిండింది. మల్లిమడుగు, కాళంగి, అరణియార్, వాకాడులోని వైఎస్సార్ బ్యారేజ్, కృష్ణాపురం రిజర్వాయర్లకు వంద శాతం నీరు చేరింది. ఈ క్రమంలోనే 2,576 చెరువులకు గాను 2,200 చెరువులు వంద శాతం వర్షపు నీటితో నిండినట్లు అధికారులు ప్రకటించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం
తుపాను బలపడుతుందనే సంకేతాలు రావడంతో జిలాల్లోని నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశామని జిల్లా వాటర్ రిసోర్స్ ఎస్‌ఈ రాధాకృష్ణమూర్తి బుధవారం తెలిపారు. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద వరద పరిస్ధితిని సమీక్షించామని వివరించారు. ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే నీటి కాలువల మరమ్మతులకు రూ.33 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ప్రారంభమైన విద్యాసంస్థలు
తిరుపతి సిటీ : మోంథా తుపాను ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ కేవీఎన్ కుమార్ బుధవారం నుంచి పాఠశాలలను మొదలుపెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లాలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సైతం తరగతులు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని గరుడ వారధిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. తిరుపతిలోని మంగళంలో నివసిస్తున్న రమేష్(40 సొంత పనుల నిమిత్తం బైక్‌పై తిరుచానూరు వెళ్లారు. తిరిగి గరుడ వారధిపై నుంచి వస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద అదుపు తప్పి పిట్ట గోడను ఢీకొన్నాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
నిండిన జలాశయాలు


