కొనలేం..తినలేం!
ప్రస్తుతం మార్కెట్‌లో
కూరగాయల ధరలు
కూరగాయలు కిలో రూ.లో టమాట 75
ఉల్లి 70
వెల్లుల్లి 220 వంకాయ 110
బెండ 85
పచ్చిమిర్చి 90
కాకర 90
బీరకాయ 110
దొండ 100
గోరు చిక్కుడు 105 బీన్స్ 125
క్యారెట్ 110
బీట్‌రూట్ 105
బంగాళదుంప 95
ఆకుకూరలు కట్ట 55
రూ.వంద దాటిన కేజీ
ధరల పెరుగుదలతో గృహిణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏ కూర చేయాలన్నా టమాట, ఉల్లి తప్పనిసరి. ప్రస్తుతం కేజీ టమాట ధర రూ.వందకు చేరువలో ఉంది. రిటైల్ షాపులలో వంకాయ, బెండకాయ, బీన్స్, క్యారెట్ ధరలు రూ. 100 నుంచి 110వరకు పలుకుతున్నాయి. రైతు బజార్‌లోనే రూ.85 ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉల్లి ధరలు నాణ్యత, రకం మేరకు కేజీ రూ. 65 నుంచి 90వరకు పలుకుతున్నాయి. బెండ, చిక్కుడు, కాకర, బీట్‌రూట్, క్యారెట్, వంగ, బీన్స్, బంగాళదుంప వంటి కూరగాయలు ప్రస్తుతం తిరుపతి మార్కెట్‌లో రూ. 50 నుంచి రూ.120వరకు విక్రయిస్తున్నారు.
తిరుపతి సిటీ : జిల్లాపై మోంథా తుపాను ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. మూడు రోజులుగా జన జీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కడాతేగానీ డొక్కాడని దినసరి కూలీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏం తినాలన్నా మార్కెట్‌లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. కేజీ కొనుగోలు చేసేవాళ్లు ప్రస్తుతం 250 గ్రాములతోనే సరిపెట్టుకుంటున్నారు.
దెబ్బతిన్న పంటలు
కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణం మోంథా తుఫాన్ ప్రభావమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూరగాయల సాగు అధికంగా చేపట్టిన జిల్లాలలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా జిల్లాలో కూరగాయల సాగు సుమారు 2వేల ఎకరాల్లో చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కేవలం వెయ్యి ఎకరాలకే మాత్రమే చేపట్టారు. సాగు విస్తీర్ణానికి తగ్గట్టు పంట దిగుబడి రాకపోవడం. ఇతర రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో టమాట, ఉల్లి దిగుమతులు లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెటింగ్ శాఖ అంచనా ప్రకారం తిరుపతిలో రోజుకు 3వేల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని, ప్రస్తుతం కేవలం 1,500 టన్నులు మాత్రమే రోజుకు దిగుమతి అవుతున్నాయని సమాచారం. మరో రెండు నెలల పాటు కొండెక్కిన కూరగాయల ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కొరవడిన ప్రోత్సాహం
కూరగాయల పంటల సాగుతో పాటు పూల తోటలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. విత్తన సరఫరా, వ్యవసాయాధికారులనుంచి సమాచార లోపం కారణంగా చెప్పవచ్చు. ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
కొనలేం..తినలేం!


